Siddaramaih : కర్ణాటక (karnataka) లో సీఎం మార్పు ఊహాగానాలకు సాధ్యమైనంత తొందరగా తెరదించాలని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కాంగ్రెస్ హైకమాండ్ (Congress High command) కు విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో సీఎం మార్పు ఉండవచ్చునని ఎప్పటి నుంచో ఊహాగానాలు మొదలయ్యాయి. నవంబర్ నెల ముగింపునకు వచ్చినా ఆ ఊహాగానాలకు ఇంకా తెరపడటం లేదు.
ఈ ఊహాగానాలపై సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. ఆ వార్తలకు శుభం కార్డు వేసేలా త్వరలో నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. 2023లో జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన నాటి నుంచి రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. నవంబర్ 20తో ఆ రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దాంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.
ఈ క్రమంలో ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య, పూర్తికాలం సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని డీకే ప్రకటించి వివాదానికి తెరదించినట్లే కనిపించారు. కానీ డీకే మరోవైపు సీఎం పదవిపై పరోక్షంగా ఆశను వ్యక్తంచేస్తున్నారు. దాంతో ఆయన మద్దతుదారులు డీకేకు సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని కట్టడిచేసేందుకు డీకే నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో కన్ఫ్యూజన్కు త్వరలో తెరదించాలని సిద్ధరామయ్య హైకమాండ్‌ను కోరారు.