న్యూఢిల్లీ, నవంబర్ 25: ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్‌లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్‌లో భారీగా రూ.1.02 లక్షల కోట్ల రిడెంప్షన్ జరిగింది. ఆగస్టులోనూ రూ.7,980 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో 91 రోజుల్లోగా మెచ్యూరిటీకి వచ్చే లిక్విడ్ ఫండ్స్, మెచ్యూరిటీకి ఒక్కరోజు గడువుండే ఓవర్‌నైట్ ఫండ్స్‌ల్లోకి పెద్ద ఎత్తున నిధులు వెల్లువెత్తాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ దాదాపు 10 శాతం పెరిగింది. సెప్టెంబర్‌లో రూ.17.8 లక్షల కోట్లుగా ఉంటే.. అక్టోబర్‌కు రూ.19.51 లక్షల కోట్లకు చేరినట్టు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ తెలియజేసింది.