ముంబై : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఆదివారం ఖరారు చేసింది. పదితో మందితో విడుదల చేసిన జాబితాలో పీ చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ వంటి సీనియర్ నేతలకు అవకాశం కల్పించింది. దిగ్గజ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మకు చోటు దక్కుతుందని అందరూ భావించినప్పటికీ వారికి అధిష్ఠానం మొండి చేయి చూపింది. రాజ్యసభ బెర్తులు
దక్కకపోవడంపై పలువురు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాల వేదికగా తమ నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ నటి నగ్మ సైతం తనకు రాజ్యసభ అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను తప్పకుండా పెద్దలు సభకు పంపుతానని 2003-04 సమయంలో సోనియా గాంధీ మాటిచ్చారని, 18 ఏళ్లు గడిచినా తనకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ భాయ్ వంటి వారికి మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. బహుశా తనకు తక్కువ అర్హతలు ఉన్నయేమోనని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీకి కాంగ్రెస్ అవకాశం ఇవ్వగా.. సొంత రాష్ట్రానికి చెందిన నేతలు చాలా మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు రాజ్యసభకు అవకాశం ఇవ్వడంపై అదే రాష్ట్రానికి చెందిన సిరోహి కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్యం లోధా అధిష్టానాన్ని ప్రశ్నించారు. అయితే, రాజస్థాన్ నుంచి తనకు కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశించి.. భంగపడ్డ పవన్ ఖేరా.. తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు. తన తపస్సు కొద్ది దూరంలో ఆగిపోయిందేమోనంటూ ఆదివారం వ్యాఖ్యానించిన ఆయన.. సోమవారం కాస్త శాంతించి.. కాంగ్రెస్ నేతలందరికీ పార్టీ వల్లే గుర్తింపు వచ్చిందని, ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దంటూ మరో ట్వీట్ చేశారు.
ఇది తన అభిప్రాయమని, అందుకు కట్టుబడి ఉంటానని కొద్ది రోజుల కిందట తను చెప్పిన మాటలనే గుర్తు చేశారు. కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి యూపీ చెందిన ఇమ్రాన్‌కు అవకాశం ఇవ్వగా.. రంజీత్ రంజన్ ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభకు పంపనున్నది. చిదంబరం మరోసారి తమిళనాడు నుంచి, వివేక్ తంఖా మధ్యప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లనున్నారు. 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.