(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘ఆలి లేదు, చూలు లేదు కానీ కొడుకు పేరు..’ అన్నట్టుగా ఉన్నది ఛత్తీస్‌గఢ్‌లోని హస్తం పార్టీ నేతల తీరు. రాష్ట్రంలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే… ఫలితాలు వచ్చినట్టు, గెలిచేసినట్టు కాంగ్రెస్ నేతలు అప్పుడే సీఎం సీటు నాదంటే నాదని కొట్టుకొంటున్నారు.
డిప్యూటీ సీఎం, అంబికాపూర్ అభ్యర్థి టీఎస్ సింగ్ దేవ్ శుక్రవారం జరిగిన అసెంబ్లీ రెండో విడత ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. పార్టీ అధిష్ఠానంలో, తనను సమర్థించే నేతల మదిలో తదుపరి సీఎంగా తన పేరు ఉన్నదని పేర్కొన్నారు. తాను కూడా సీఎం పదవిని ఆశిస్తున్నట్టు, సీఎం రేసులో ఉన్నట్టు సింగ్ దేవ్ ఈ సందర్భంగా మనసులోని మాట బయటపెట్టారు. ఈ సందర్భంగా సీఎం భూపేశ్ బఘేల్‌ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలకు సీఎం బఘేల్ కెప్టెన్ అయినప్పటికీ, సమిష్ఠి నాయకత్వంతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లిందని అన్నారు.