ముంబై: మహారాష్ట్రపై పట్టు సాధించడమే తన లక్ష్యమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) తెలిసారు. దీని కోసం ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా విజయం సాధించాలని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేసిన పది స్థానాలకుగాను ఎనిమిది సీట్లు గెలిచిన ఆయన పార్టీ అద్భుతంగా రాణించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా గురువారం బారామతిలోని శిర్సుఫాల్ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బారామతి నియోజకవర్గం ప్రజలు మౌనంగా ఉన్నప్పటికీ ఈవీఎంపై సరైన బటన్ నొక్కారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘రాబోయే మూడు, నాలుగు నెలల్లో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా అయినాసరే మహారాష్ట్రపై పట్టు సాధించడం నా ప్రయత్నం. దీనిని సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలవాలి’ అని అన్నారు.
కాగా, తాను నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దశాబ్ద కాలం పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రెండేళ్లు రక్షణ మంత్రిగా పనిచేశానని శరద్ పవార్ గుర్తు చేశారు. ‘మీరు నా ముందు సమస్యలు ఉంచారు. నేను వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుతం వేరే ప్రభుత్వం ఉన్నందున నేను ఇప్పుడు హామీ ఇవ్వలేను. కానీ నాలుగు నెలల తర్వాత, మేం ఈ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. దీనికి మీ సమిష్టి శక్తి అవసరం’ అని అన్నారు.