ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆందోళన కలిగించే నిజ జీవిత సంఘటనను బయటపెట్టారు. బాలల పట్ల జరుగుతున్న సైబర్ నేరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ముంబైలోని మహారాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన సైబర్ అవగాహన నెల 2025 ప్రారంభోత్సవంలో అక్షయ్ మాట్లాడుతూ, కొన్ని నెలల క్రితం తన పదమూడేండ్ల కుమార్తె ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్నపుడు జరిగిన దారుణం గురించి తెలిపారు. “కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన ఓ చిన్న సంఘటనను మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. నా కూతురు వీడియో గేమ్ ఆడుతున్నది. వేరొకరితో ఆడుకోగలిగే వీడియో గేమ్స్ కొన్ని ఉంటాయి.
మీరు ఓ గుర్తు తెలియని, పరిచయం లేని వ్యక్తితో ఆడుతున్నారు. మీరు ఆడుతుండగా, కొన్నిసార్లు ఓ సందేశం వస్తుంది. మీరు ఆడవాళ్లా? మగవాళ్లా? అని అడుగుతారు. అప్పుడు నా కూతురు ‘నేను అమ్మాయిని’ అని చెప్పింది. అప్పుడు అవతలి వ్యక్తి ఓ మెసేజ్ పంపించాడు. నీ నగ్న చిత్రాలు పంపించగలవా?..అని, ఇది కూడా సైబర్ నేరంలో భాగమే. మహారాష్ట్రలో 7, 8, 9, 10 తరగతులకు ప్రతి వారం సైబర్ పీరియడ్ ఉండాలని, సైబర్ నేరాల గురించి వివరించాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఈ నేరాలను ఆపడం చాలా ముఖ్యం” అని అక్షయ్ కుమార్ అన్నారు.
ఆన్లైన్ గేమింగ్ కోసం ముసాయిదా నియమాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ విడుదల చేసింది. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఓజీఏఐ)ను ప్రత్యేక నియంత్రణ సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గురువారం జారీ చేసిన ఈ ముసాయిదా నియమాలపై ప్రజలు ఈ నెల 31 లోగా తమ అభిప్రాయాలను పంపాలని కోరింది. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యేలేషన్ (పీఆర్‌వోజీ) చట్టం 2025ను అమలు చేయడానికి ఇది ఉద్దేశించినది. ఇది ఆన్లైన్ పోకర్, రమ్మీ, ఫాంటసీ క్రీడలు వంటి రియల్ మనీ గేమ్‌ల ప్లాట్‌ఫారమ్‌లను నిషేధిస్తుంది. అదే సమయంలో సోషల్ గేమ్‌లు, ఇ-స్పోర్ట్‌లను మాత్రమే అనుమతిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఢిల్లీ-ఎన్సీఆర్ కేంద్రంగా డిజిటల్‌గా పనిచేస్తుంది. ఈ సంస్థలో ఐటీ, సమాచార ప్రసార శాఖ శాఖ, యువజన వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ అధికారులు, న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. అలాగే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వినియోగదారులు తమ పరిష్కరించని ఫిర్యాదులను మొదట అప్పిలేట్ కమిటీకి, తర్వాత అథారిటీకి తెలియజేయవచ్చు.