
న్యూఢిల్లీ: మయన్మార్‌లోకి చైనా చొచ్చుకు వస్తున్నదని, దానిపై భారత్ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ సూచించారు. ఒక సంస్థ ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు విధించారని చెప్పారు. మయన్మార్‌లో వేగంగా సాధారణ పరిస్థితులు తీసుకురావడం భారత్‌కు, ఈ ప్రాంతానికి చాలా అవసరమన్నారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన ప్రదేశాలతో కలిపే సిలిగురి కారిడార్ మయన్మార్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో చైనా దీనిపై దృష్టిపెట్టింద చెప్పారు.
మయన్మార్ సరిహద్దుల్లో సరైన అడ్డంకులు లేకపోవడంతో అక్రమ వలసదారులు, వేర్పాటువాదులు, మాదకద్రవ్యాల సరఫరాకు కేంద్రంగా మారిందని రావత్ తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు అప్రమత్తంగా ఉండాలని.. భారత్ పొరుగుదేశాలతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన సహకారాన్ని తీసుకోవాలని సీడీఎస్ సూచించారు. అయితే ఇటీవల మయన్మార్‌లో నిర్వహించిన వేర్పాటువాద వ్యతిరేక ఆపరేషన్లతో అక్కడ కొంత శాంతి నెలకొన్నదన్నారు. వేర్పాటువాదులకు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్లు కూడా ఈ మధ్య ఆశ్రయం ఇవ్వడంలేదని చెప్పారు.