బెంగళూరు : కర్ణాటకలో డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో ముస్లింలకు ఐదు మంత్రి పదవులు కేటాయించాలని ముస్లిం నాయకులు, మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ముస్లింల ఓటర్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రివర్గంలో తగు ప్రాతినిధ్యం కల్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మత నాయకులు, మత పెద్దలు బెల్లినగర్లోని ఒక దర్గాలో బుధవారం సమావేశమయ్యారు.
మంత్రివర్గంలో కాంగ్రెస్ నేతలు బీజడ్ జమీర్ అహ్మద్ ఖాన్, ఎన్ఏ హర్రీస్, తన్వీర్ సైత్, సలీమ్ అహ్మద్‌లకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ఖాతరు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీ స్పీకర్‌గా యూటీ ఖాదర్‌ను నియమించిన క్రమంలో మిగిలిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. అలా కాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఒక నేత హెచ్చరించారు.