కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగీత వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో పంపిణీ చేయగా ఆ సామాగ్రితో వారు పాటలు పాడి ఆకట్టుకున్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగీతంలో విద్యార్థులకు తర్ఫీదునివ్వగా, సీఎం చేతుల మీదుగా వారికి వాయిద్య సామాగ్రి అందజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత ఖర్చులతో విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం విద్యార్థులు పాడిన పాటల సీడీ, దివ్యదృష్టి వీడియో ఆల్బమ్‌లను సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, అడ్లూరితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టు అంధులైన ఈ చిన్నారులు తమ దివ్యదృష్టితో సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో ఉన్న స్తోత్రాలను కూడా అలవోకగా పాడుతుండటం అభినందనీయమన్నారు. సొంత భాష కూడా సక్రమంగా ఉచ్చరించలేని ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టంగా రాగయుక్తంగా స్తోత్రాలు ఆలపించటం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.
ఎంతో కృషి చేస్తే తప్ప ఇది సాధించలేరని, చిన్నారులు మరింత వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. కలెక్టర్ పమేలా సత్పతి విద్యారంగంలో చిన్నారులను ప్రోత్సహించటం ఆదర్శనీయమన్నారు. వీడియో ఆల్బమ్‌కు నంది శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కేబీ శర్మ సంగీతాన్ని అందించారు. లక్ష్మి గౌతమ్ వీడియో రికార్డు చేశారు. వీరితోపాటు సంగీత ఉపాధ్యాయురాలు సరళను సీఎం అభినందించారు. కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, కలెక్టర్ పమేలా సత్పతి, బాల గాయకులు సింధుశ్రీ, శ్రావణి, తిరుమల, అఖిల, నిత్యశ్రీ, జాహ్నవి, కల్పన, ప్రణయ్, సాయిరామ్, మణిదీప్, అక్షయ్, వరుణ్ తేజ్, మణిరతన్, లోహిత్తోపాటు ప్రభుత్వ బధిరుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి పిల్లలతో కలిసి సచివాలయాన్ని సందర్శించారు.