Mumbai | ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బేలాపూర్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు థానే వెళ్లేందుక బేలాపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు వచ్చింది. అయితే భారీగా ప్రయాణికులు ఉండడంతో.. ఆమె ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు పట్టాలపై జారిపడింది.
అప్రమత్తమైన ప్రయాణికులు, రైల్వే పోలీసులు.. రైలును నిలిపివేశారు. పట్టాలపై పడి ఉన్న మహిళ ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు కోల్పోయింది. అయితే కేవలం ఒక కంపార్ట్మెంట్ మాత్రమే ఆమె పైనుంచి దూసుకెళ్లింది. మొత్తం రైలు ఆమె మీద నుంచి దూసుకెళ్లి ఉంటే ప్రయాణికురాలి ప్రాణాలకు ప్రమాదం ఉండేదని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గత రాత్రి నుంచి ముంబైలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ముంబైలో ఎక్కడా చూసినా వర్షపు నీరు నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. కుర్లా – చునభట్టి మధ్య లోకల్ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ఇతర మార్గాల్లో నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది.