ముంబై : నూతన సంవత్సర వేడుకలకు దేశ వాణిజ్య రాజధాని ముంబై సంసిద్ధమవుతుండగా గుర్తుతెలియని వ్యక్తి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో (Bomb Threat) బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు కాల్ వచ్చింది. ఆగంతకుని నుంచి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు శనివారం రాత్రి అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది.
ముంబైలో పేలుళ్లు జరుగుతాయని హెచ్చరించిన కాలర్ ఆపై కాల్ కట్ చేశారు. బెదిరింపు కాల్ నేపధ్యంలో ముంబై నగరమంతటా విస్తృతంగా తనిఖీలు చేపట్టామని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. కాలర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో ముంబైలో బందోబస్తు ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. మరోవైపు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని థానేలో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations ) ముందు ఆదివారం తెల్లవారుజామున రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
అరెస్టయిన వారిలో ఇద్దరు రేవ్ పార్టీ నిర్వాహకులు కూడా ఉన్నారు. థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ చేపట్టిన లేట్ నైట్ ఆపరేషన్‌లో రేవ్ పార్టీ బాగోతం బయటపడింది. ఘటనా స్ధలంలో ఎల్ఎస్డీ, మరిజువన సహా పలు మత్తు పదార్ధాలు లభ్యమయ్యాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక న్యూ ఇయర్ పార్టీని భారీ స్ధాయిలో నిర్వహిస్తూ యువత డ్రగ్స్ వాడుతున్న తీరు ఈ ప్రాంతంలో కలకలం రేపింది.
Read More :
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో ఈ నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు.. పోలీసుల హెచ్చరిక