ముంబై: ఒక సంస్థలో పని చేసే ఉద్యోగి ఏకంగా యజమానిని మోసగించాడు. రూ.5.72 కోట్ల విలువైన బంగారు నాణేలను కాజేశాడు. (Gold Coins) తన సొంత ఆర్థిక అవసరాల కోసం వాటిని వాడుకున్నాడు. యజమాని ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. వాన్రాయ్ ప్రాంతంలోని కార్పొరేట్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేసే సంస్థలో రెండేళ్లుగా సునీల్ గుప్తా పని చేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే అధికారంతో పాటు ఆ కంపెనీ ఇమెయిల్ ఖాతాల యాక్సెస్‌ను అతడు కలిగి ఉన్నాడు.
కాగా, కార్పొరేట్ బహుమతి కోసం ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ బంగారు నాణేలను ఆర్డర్ చేసిందని యజమాని నరేష్ జైన్‌కు సునీల్ గుప్తా తెలిపాడు. దీంతో రూ. 2.46 కోట్ల విలువైన 3.4 కిలోల బంగారు నాణేలను ఆయన కొనుగోలు చేశాడు. డెలివరీ కోసం వాటిని సునీల్‌కు అప్పగించాడు. అయితే నకిలీ పత్రాలు, ట్యాక్స్ ఇన్వాయిస్లను యజమానికి చూపించాడు. బంగారు నాణేలను ఆ ఫార్మా కంపెనీకి డెలివరీ చేసినట్లు నమ్మించాడు.
మరోవైపు ఆ ఫార్మా కంపెనీ గోల్డ్ కాయిన్స్ కోసం రెండో ఆర్డర్ ఇచ్చిందని యజమాని నరేష్ జైన్‌కు సునీల్ గుప్తా తెలిపాడు. దీంతో రూ.3.17 కోట్ల విలువైన మరో 3.6 కిలోల బంగారు నాణేలు కొని అతడికి అందజేశాడు.
కాగా, ఈ రెండు ఆర్డర్లకు చెల్లింపులు జరుగకపోవడాన్ని యజమాని నరేష్ జైన్ గుర్తించాడు. సునీల్ గుప్తాను నిలదీయగా ఆ బంగారు నాణేలను డెలివరీ చేయలేదని తెలిపాడు. వ్యక్తిగత ప్రయోజనం కోసం వాటిని వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు.
అయితే గోల్డ్ కాయిన్స్ కోసం ఏ ఫార్మా కంపెనీ ఆర్డర్లు ఇవ్వలేదని సునీల్ గుప్తా తెలిపాడు. ఆర్డర్లు, డెలివరీకి సంబంధించి బోగస్ ఇన్వాయిస్లు, నకిలీ పత్రాలు సృష్టించినట్లు అంగీకరించాడు. తన ఆర్థిక సమస్యలు తీరిన తర్వాత రూ5.72 కోట్ల డబ్బు తిరిగి చెల్లిస్తానని నరేష్ జైన్‌కు చెప్పాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్ గుప్తాను అరెస్ట్ చేశారు.
Also Read:
MGR’s Statue Vandalised | మదురైలో ఎంజీఆర్ విగ్రహం ధ్వంసం.. అన్నాడీఎంకే నేతలు నిరసన
Watch: ఆటోను భుజాలపై మోసి నదిని దాటించిన స్థానికులు.. ఎందుకంటే?