Omicron XE | కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ ముంబైలోకి ఎంటరైంది. 67 ఏండ్ల ముంబై వాసికి ఒమిక్రాన్ ఎక్స్ఈ సోకిందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) అధికారులు శనివారం ధృవీకరించారు. గత నెల 12న ముంబై నుంచి వడోదరకు వెళ్లిన ఆ వ్యక్తి స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో ఆయన వద్ద రక్త నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ కోసం పంపగా, ఒమిక్రాన్ ఎక్స్ఈ అని పరీక్షల్లో తేలిందన్నారు.
బాధితుడు కొవిషీల్డ్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్నాడు. పూర్తిగా ఎటువంటి లక్షణాలు లేవు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, అతడికి ఒమిక్రాన్ ఎక్స్ఈ సోకినట్లు తేలడంతో ఆయన్ను కలుసుకున్న వారిని ట్రేస్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మూడు రోజుల క్రితం సౌతాఫ్రికాకు చెందిన మహిళా సినిమా కాస్ట్యూమ్ డిజైనర్‌కు ఒమిక్రాన్ ఎక్స్ఈ సోకిందని అధికారులు ప్రకటించినా.. కేంద్రం తోసిపుచ్చింది. ఒమిక్రాన్ బీఏ.1, ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ల కాంబినేసనే ఒమిక్రాన్ ఎక్స్ఈ. ప్రాథమిక నివేదికల ప్రకారం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉందని అధికారులు తెలిపారు.
వైరస్ల జినోమ్ మారడం సర్వ సాధారణం అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అన్నారు. ప్రజలు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.