Mumbai civic polls : ముంబై నగరపాలిక అయిన బీఎంసీ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ముంబై వాసులకు ఎన్నికల వరాలు కురిపించింది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన (షిండే) పార్టీలతో కూడిన ఈ కూటమి తాము ఎన్నికల్లో గెలిచి, ముంబై పీఠాన్ని అధిరోహిస్తే మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించింది.
రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలివ్వనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు.. మురికివాడలు లేని నగరంగా ముంబైని తీర్చిదిద్దుతామని తెలిపింది. ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే సహా పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ముంబై అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తాము కచ్చితంగా హిందుత్వకు కట్టబడ్డామని, అయితే, అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహా అక్రమ వలసదారుల్ని తరిమేస్తామన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీ వాడుతామని తెలిపారు.
ముంబైలోని మురికి వాడల్ని అభివృద్ధి చేస్తామని, మరాఠీలు తిరిగి వచ్చేలా చూస్తామని, పాత పగ్డి బిల్డింగులను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్ధవ్ థాక్రే వర్గం అభివృద్ధి గురించి మాట్లాడరని తెలిపారు. ఈ నెల 15న జరగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఇప్పటికే అక్కడ హాలిడే ప్రకటించింది.