తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో మైక్రోసైట్, ఈ-బ్రోచర్లను రాష్ట్ర పర్యాటక శాఖ బుధవారం ప్రారంభించింది. వీటిని రాష్ట్ర పర్యాటక, ప్రజా పనుల శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ప్రారంభించారు. https://www. keralatourism.org/sabarimala/ ద్వారా శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, తాజా వివరాలు, భౌగోళిక పరిస్థితులు వంటివాటిని తెలుసుకోవచ్చు. దీనిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం, కన్నడ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ యాత్రను పూర్తి చేసుకోవడానికి ఈ మైక్రోసైట్, ఈ-బ్రోచర్ ఉపయోగపడతాయని మహమ్మద్ చెప్పారు. రాష్ట్రంలో భక్తి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి తెస్తామన్నారు.