బెంగళూరు, జూలై 7: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) పరిధిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ‘సురక్షిత ప్రాంతానికి’ తరలించిందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆర్కావతి లేఔట్ స్కామ్‌ను మరుగు పరిచినట్టుగా..కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్‌ను మూయించలేదని ఆయన అన్నారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వివాదంలో ఉన్న సంబంధిత భూమిని సీఎం సిద్ధరామయ్య 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన అఫిడవిట్లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. ‘2005-06 మధ్యనే అంతా జరిగిందని సిద్ధరామయ్య చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ భూమిని 2013 ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపలేదు? స్కామ్ జరుగకుంటే, దర్యాప్తును సీఎం ఎందుకు అడగడం లేదు?’ అని కుమారస్వామి ప్రశ్నించారు. ముడా నుంచి ఎలాంటి పత్రాలు తరలించారు, వాటిని ఎక్కడ ఉంచారో చెప్పాలని రాష్ట్ర మంత్రి బైరతి సురేశను డిమాండ్ చేశారు.