MUDA Scam | బెంగళూరు, ఆగస్టు 29: ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) తక్కువ విలువైన స్థలాన్ని సేకరించి ఖరీదైన స్థలాన్ని కట్టబెట్టిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ అంశంలో సిద్ధరామయ్యను విచారించేందుకు ఆగస్టు 17న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతించారు. అయితే, రాష్ట్ర మంత్రివర్గం అనుమతి తీసుకోకుండా గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, వీటిని కొట్టేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం సిద్ధరామయ్య పిటిషన్ విచారణ సందర్భంగా మంత్రివర్గ నిర్ణయంపై ఆధారపడాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది.
ముడా భూకేటాయింపు కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతిపై లక్ష్మిపుర పోలీస్స్టేషన్లో స్నేహమయి కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కీలకమైన డాక్యుమెంట్లో మార్పులు చేశారని పార్వతితో పాటు ముఖ్యమంత్రి సన్నిహితుడు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎం లక్ష్మణపై ఫిర్యాదు ఇచ్చారు. అయితే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
విజయనగర్ లేఅవుట్లోని ఖరీదైన ప్రాంతంలో భూమిని కేటాయించాల్సిందిగా ముడాను పార్వతి అడిగారని, ఈ లేఖ బయటకు వచ్చిన తర్వాత దేవనూరు లేదా మరో ప్రాంతంలో స్థలం అడిగినట్టుగా లేఖను మార్చారని స్నేహమయి కృష్ణ ఆరోపించారు.