న్యూఢిల్లీ, ఆగస్టు 22: కేంద్రంలోని మోదీ సర్కారుపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి విరుచుకుపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధహామీ కల్పించకపోవడంపై విమర్శలు గుప్పించారు. దేశంలోని రైతులను మీరు (కేంద్రం) ఓడించలేరని, డిమాండ్ సాధించుకునేంతవరకు వారి పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ఎంఎస్పీ అమలుచేయకపోయినా, చట్టబద్ధహామీ కల్పించకపోయినా.. మరోసారి పోరాటం తప్పదు. ఈసారి అది మరింత తీవ్రంగా ఉంటుంది. మీరు దేశ రైతులను ఓడించలేరు. వారిని భయపెట్టలేరు. వారిపైకి ఈడీ, సీబీఐలను ప్రయోగించలేరు కాబట్టి.. వారిని ఏ విధంగా బెదిరించగలరు?’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోదీ మిత్రుడు అదానీ కారణంగానే ఎంఎస్పీ అమలుచేయడం లేదని మాలిక్ ఆరోపించారు. ‘గువాహటి ఎయిర్పోర్టులో బొకే పట్టుకున్న ఓ మహిళను కలిశాను.
ఎక్కడి నుంచి వచ్చారు అడగ్గా, అదానీ తరఫున వచ్చాం అని ఆమె బదులిచ్చారు. దానర్థం ఏంటి అని అడగగా.. ఈ ఎయిర్పోర్టును అదానీకి అప్పగించారని ఆమె పేర్కొన్నది. అదానీకి దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, పోర్టులు, మేజర్ స్కీమ్లను కట్టబెడుతున్నారు. దేశం మొత్తాన్ని అమ్మేసేందుకు సిద్ధమయ్యారు. అయితే దాన్ని జరుగనివ్వం’ అని ఆయన పేర్కొన్నారు.