భోపాల్: మహిళా పోలీస్ ఒక వ్యక్తి చెంపపై కొట్టింది. దీనికి ముందు అతడితో తన ప్యాంట్‌ను తుడిపించుకున్నది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఉదయం సిర్మౌర్ చౌక్ వద్ద ఒక మహిళా కానిస్టేబుల్ నిల్చొని ఉంది. ఇంతలో ఒక వ్యక్తి తన బైక్‌ను వెనక్కి తీయగా ఆమె ప్యాంట్‌కు కాస్త తగిలింది. దీంతో అంటిన మట్టిని తుడవాలని ఆ మహిళా కానిస్టేబుల్ అతడ్ని ఆదేశించింది. ఆ వ్యక్తి ఒక ఎర్రని గుడ్డతో మహిళా కానిస్టేబుల్ ప్యాంట్‌ను తుడిచాడు. ఆ పని పూర్తి కాగానే ఆమె అతడి చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాగా, ముఖానికి క్లాత్ ఉండటంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరు అన్నది తొలుత తెలియలేదు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే హోంగార్డ్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ శశికళగా తర్వాత గుర్తించారు. స్థానికులు తమ మొబైల్ ఫోన్లో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించారు. ఆ మహిళా కానిస్టేబుల్ చర్యను తప్పు పట్టారు. అయితే ఫిర్యాదు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే దీనిపై దర్యాప్తు చేస్తామని రేవా అదనపు ఎస్పీ శివ కుమార్ తెలిపారు. కాగా, ఆ మహిళా కానిస్టేబుల్ ప్యాంట్‌కు బైక్ తగిలి మట్టి అంటుకున్న దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు.