Pakistan MP | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశం అంతర్జాతీయ సమాజాన్ని సాయం చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఎంపీ సాక్షాత్తూ పార్లమెంట్లో ‘దేవుడా భారత్ నుంచి పాకిస్థాన్‌ను కాపాడు’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ ఆర్మీ రిటైర్డ్ మేజర్, ఎంపీ తాహిర్ ఇక్బాల్ బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు. ‘మనది బలహీనమైన దేశం. అందుకే మనందరం కలిసి.. ఓ దేవుడా మా దేశాన్ని నువ్వే కాపాడాలి అని ప్రార్థిద్దాం. ఈ దేశం ప్రార్థనల నుంచే పుట్టింది. మా నేతల కలలోకి అల్లా వచ్చి, పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.
మీ కృపతో సాకారమైన దేశాన్ని ఇప్పుడు మీరు మాత్రమే కాపాడగరని ఆ దేవుడిని ప్రార్థిద్దాం’ అంటూ ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీరుమున్నీరయ్యారు. ‘ఓ అల్లా.. మేం పాపాత్ములం. అనేక పాపాలు చేశాం. మమ్మల్ని క్షమించు. మేము మీ ముందు మేం తలవంచుతున్నాం. మీ దయ మాపై ఉండాలని వేడుకుంటున్నాం’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఎంపీ తాహిర్ వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.