హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు గడించవచ్చంటూ ప్రలోభ పెడుతున్నారు. ఇది నిజమని నమ్మించేందుకు ప్రముఖుల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి.. డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఎంపీ సుధామూర్తి ఈ తరహా పెట్టుబడులపై రాజ్యసభలో మాట్లాడినట్టుగా తయారు చేసిన ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. వీడియో దిగువన ఉన్న లింక్ క్లిక్ చేసి, పెట్టుబడులు పెట్టాలని సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు.
ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన చాలామంది నెలకు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ లింక్‌ను క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల గుప్పిట్లోకి వెళ్తుంది. కొందరు పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. అచ్చంగా సుధామూర్తి మాట్లాడినట్టుగానే క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియో వాస్తవమని నమ్మిన చాలామంది సైబర్ నేరాలకు గురయ్యారు.
ఈ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు వెలుపల సుధామూర్తి స్పందించారు. ‘తక్కువ పెట్టుబడి పెడితే 20-30 రెట్ల లాభాలు వస్తాయని నేను చెప్పినట్టుగా నా ఫేస్ ఉపయోగిస్తూ డీప్ ఫేక్ వీడియో తయారు చేయడం చాలా విచారకరం. నేను ఎప్పుడూ.. ఎక్కడా పెట్టుబడుల గురించి మాట్లాడలేదు. నేను చెప్పినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి. కష్టపడి సంపాదించిన డబ్బులను పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు.