Raut attitude | ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వైఖరిలో మార్పు కనిపించింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు. త్వరలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో కలవాలన్న ఆకాంక్షను కూడా వ్యక్తం చేసి అందర్నీ విస్మయపరిచారు.
బెయిల్‌పై ఇంటికి వచ్చిన సంజయ్ రౌత్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో గతంలోని వేడిదనం తగ్గిపోయింది. ఘాటు వ్యాఖ్యలు కరువయ్యాయి. ఉద్దవ్ ఠాక్రేపై ఈగ కూడా వాలనివ్వని తీరుగా ప్రవర్తించిన రౌత్.. ఠాక్రే వ్యతిరేక వర్గం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి కితాబునిచ్చారు. అంతటితో ఆగకుండా మోదీ, అమిత్‌షాలను కలవాలన్న కోరికను కూడా వెలిబుచ్చాడు. రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అవుతానని చెప్పారు. పట్రా చాల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంజయ్ రౌత్‌కు బుధవారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
షిండే ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నదని చెప్పిన సంజయ్ రౌత్.. తాను వాటిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ నడుపుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. తాను మొత్తం వ్యవస్థను లేదా ఏ కేంద్ర సంస్థను నిందించనని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ వైషమ్యాలు చూడలేదని విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాను కలుస్తానని తెలిపారు.