హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో(West bengal )తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ (TMC) అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. మమతపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ చెప్తున్నారు. తాజాగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్బరైక్( MP Prakash Chikbaraik )పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో టీఎంసీకి మరో ఎదురుదెబ్బ తగిలనట్లయింది.
ఇటీవలే రాజ్యసభ సభకు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ రాజీనామా చేయగా నేడు ప్రకాష్ సైతం రిజైన్ చేయడంతో వారంలోనే టీఎంసీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల సంఖ్య మూడుకు చేరింది. చిక్బరైక్ రాజీనామాతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 10 మంది సభ్యులకు పడిపోనుంది. రాబోయే వారంలో మరో ముగ్గురు టీఎంసీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉందని, తద్వారా మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి సంక్షోభం మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏలో చేరనున్నట్లు సమాచారం.