Minister Apology | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ గొప్పలకు పోతున్న బీజేపీ నాయకులు.. మధ్యప్రదేశ్‌లోని రోడ్ల దుస్థితిని ఒక్కసారి చూస్తే బాగుంటుంది. అక్కడి రోడ్లు అధ్వానంగా మారడంతో ఆ రాష్ట్ర మంత్రివర్యులే ప్రజలకు క్షమాపణలు చెప్పాడంటే.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరు ఎలాగుందో అర్థం అవుతుంది. ప్రభుత్వం తప్పిదాలకు ప్రజల్లో ఆగ్రహావేశాలు నషాలానికి చేరి దించేయకముందే.. సదరు మంత్రిగారు తమ తప్పులను తెలుసుకుని ప్రాయశ్చిత్యంగా అక్కడి వ్యక్తి కాళ్లు కడిగాడు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి ప్రధుమ్యసింగ్ తోమర్ పర్యటనలో రోడ్లు వేయాలని పలువురు కోరారు. డ్రైనేజీ పైపులైను కోసం రోడ్డును తవ్వి వదిలేశారని, గుంతలమయంగా మారిన రోడ్డు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో తప్పకుండా ఈ రోడ్డు పనులు చేయిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంతలో అదే రోడ్డు మీదుగా బురదలో నడుస్తూ వచ్చిన ఓ వ్యక్తిని ఆపిన మంత్రి.. తనే ఆయన కాళ్లు కడిగాడు. ఈ ఘటన ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాగా, మధ్యప్రదేశ్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పేర్కొంటూ ఇదే మంత్రి గారు.. రోడ్ల మరమ్మతులు చేపట్టేంత వరకు చెప్పులు వేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. దాంతో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వెంటనే రంగంలోకి దిగి గ్వాలియర్‌లోని రోడ్లకు మరమ్మతు పనులు చేయించారు. అనంతరం ఆయనతో చెప్పులు కూడా తొడిగించారు. ఇప్పుడేమో ఇలా ఓ వ్యక్తి కాళ్లు కడిగి మంత్రిగారు తమ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.