న్యూఢిల్లీ, జనవరి 31: యూజీసీ సమానత్వ నిబంధనల వివాదం నేపథ్యంలో రాజ్యసభ స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరినీ సంప్రదించకపోవడం అనే ప్రభుత్వ మొండితనం అన్ని నిర్ణయాలలో ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో సమస్యలను సృష్టించడం ప్రారంభిస్తే భారత దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యూజీసీ నిబంధనలపై తన అభిప్రాయం చెప్పటం లేదని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. విధానాన్ని రూపొందించే ముందు, దాన్ని అమలు చేసే ముందు సమాజంలోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకున్నపుడే వికసిత్ భారత్ ఆశయాన్ని ప్రభుత్వం సాధించగలదని ఆయన అన్నారు. ‘మనది చాలా వైవిధ్యభరితమైన దేశం. వైవిధ్యాన్ని ఓ ప్రయోజనంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడానికి అనుమతిస్తుంది అని సిబల్ అభిప్రాయపడ్డారు.