Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కుర్రాళ్లతో కిటకిటలాడాయి. గందరగోళ్ల పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ ‘సీ’ క్యాటగిరీ ఉద్యోగాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రిలిమినరీ అర్హత పరీక్ష (యూపీపీఈటీ) నిర్వహించారు. ఈ క్యాటగిరీలో ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 37.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. లక్షల మంది అభ్యర్థులు ఉండటంతో ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యూపీఎస్ఎస్ఎస్సీ) శని, ఆదివారాల్లో రెండేసి షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1899 పరీక్షా కేంద్రాల్లో శనివారం ఒక్కరోజే దాదాపు తొమ్మిది లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని తెలుస్తున్నది. తొలి షిప్ట్‌లో 66 శాతం, రెండో షిఫ్ట్‌లో 67 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఘజియాబాద్‌కు చెందిన దీపక్ యాదవ్ అనే అభ్యర్థి.. ప్రయాగ్ రాజ్ సెంటర్‌కు వెళ్లడానికి రైళ్లు దొరక్క ఇబ్బంది పడ్డాం అని తెలిపాడు. ఘజియాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్‌కు 200 కి.మీ. దూరం. రైళ్లు దొరక్కపోయినా తమ ఊరి అభ్యర్థులతో కలిసి గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ రైలులో నిలబడటానికి కాలు పెట్టడానికి చోటులేని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మావు ప్రాంత వాసి, లక్నో యూనివర్సిటీ విద్యార్థి మనీశ్ సింగ్ మాట్లాడుతూ రైళ్లు, బస్సులన్నీ కిక్కిరిసిపోవడంతో సకాలంలో పరీక్షకు హాజరు కాలేనని అనుకున్నట్లు చెప్పాడు. కుషినగర్‌లో కుర్రాళ్ల రాకపోకలతో రద్దీగా ఉందన్నారు. వారణాసి వాసి అనిఖెట్ యాదవ్ మాట్లాడుతూ రైలు టికెట్ తీసుకున్నా.. కాలు పెట్ట సందు లేక బస్సులో ఎలాగోలా ప్రయాణించి శనివారం సాయంత్రం పరీక్ష రాసానని చెప్పాడు. ఇది చాలెంజింగ్ టాస్క్ అని అభిప్రాయ పడ్డాడు.
విద్యార్థులు, అభ్యర్థులకు అసౌకర్యంపై యూపీఎస్ఎస్ఎస్సీ చైర్మన్ ప్రవీర్ కుమార్ రియాక్టయ్యారు. రెండు వారాల క్రితమే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు బస్సు, రైలు సౌకర్యం కల్పించాలని రైల్వే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలను కోరామని చెప్పారు. యూపీఎస్ఆర్టీసీ 6500 బస్సులు ఏర్పాటు చేసిందన్నారు. రైల్వేశాఖ వివిధ జోన్ల అధిపతులు.. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అదనపు బోగీలు ఏర్పాటు చేసినా సరిపోలేదన్నారు. సీక్రెసీ, ఫెయిర్‌నెస్ కోసమే అభ్యర్థులకు సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాట్లు చేయలేదన్నారు.