లక్నో: మాతృ దినోత్సవం రోజున ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లితోపాటు తమ్ముడ్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. (Mother’s Day Massacre) ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్కిషోర్ గుప్తా కుటుంబానికి చెందిన పూర్వీకుల ఆస్తిని తండ్రి అమ్మాడు. దీని గురించి అతడు ఆగ్రహంతో ఉన్నాడు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున ఆ భూమి అమ్మకంపై తల్లి, తమ్ముడితో రాజ్కిషోర్ గొడవ పడ్డాడు. ఆగ్రహించిన అతడు గన్తో వారిపై కాల్పులు జరిపాడు. మాతృ దినోత్సవం రోజున కన్న తల్లితోపాటు సోదరుడ్ని హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు.
మరోవైపు కాల్పుల శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న మహిళ, ఆమె కుమారుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆ ఇంటి నుంచి ఆధారాలు సేకరించారు. నిందితుడు రాజ్కిషోర్ అరెస్ట్ కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.