లక్నో: డీజే కన్సోల్ రిపేర్ కోసం డబ్బులు ఇవ్వని తల్లిపై కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెను హత్య చేశాడు. (Son Kills Mother With His Friends) దర్యాప్తు జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. మృతురాలి కుమారుడితోపాటు అతడి స్నేహితులైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 4న ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ ప్రాంతంలో 47 ఏళ్ల మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చిన్న బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే సంగీతా త్యాగిగా మృతురాలిని గుర్తించారు. ఆమె హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. సంగీతా కుమారుడైన సుధీర్ తన స్నేహితులతో కలిసి తల్లిని హత్య చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. పలు దోపిడీలు, ఇతర నేరాల్లో నిందితుడిగా ఉన్న అతడు మద్యానికి బానిసయ్యాడని గుర్తించారు. డీజే కార్యాక్రమాల్లో పని చేసే సుధీర్, డీజే కన్సోల్ రిపేర్ కోసం తల్లి సంగీతాను రూ.20,000 అడిగాడని పోలీసులు తెలుసుకున్నారు. అయితే మద్యం తాగుతాడని భావించిన ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిందని చెప్పారు.
మరోవైపు అసంతృప్తి చెందిన సుధీర్, అక్టోబర్ 3న బట్టల ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాడని, బైక్‌పై తల్లిని ఎక్కించుకుని ఒక ప్రాంతానికి తీసుకెళ్లాడని పోలీస్ అధికారి తెలిపారు. అక్కడ ఉన్న స్నేహితులు అంకిత్, సచిన్ సహాయంతో ఇటుక రాయితో ఆమె తలపై కొట్టి హత్య చేశారని చెప్పారు. మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు వివరించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు.