Domestic Violence | అలహాబాద్: కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టిన ఘటనలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహ హింస చట్టం కింద తనపై కేసు నమోదు చేయటాన్ని సవాల్ చేసిన కోడలి వాదనను తోసిపుచ్చింది. బంధుత్వంతో సంబంధం లేకుండా, ఒకే ఇంట్లో నివసించే మహిళలందరికీ సదరు చట్టం వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కోడలిపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయడానికి ధర్మాసనం అంగీకరించలేదు. ‘కోడలు లేదా కుటుంబంలోని మరే ఇతర సభ్యుడు అత్తను వేధించినా, శారీరకంగా, మానసికంగా హింసించినా, ఆమెను బాధితురాలిగా చేర్చవచ్చు.
గృహహింస చట్టంసెక్షన్ 12 కింద కేసు పెట్టొచ్చు’ అని కోర్టు పేర్కొన్నది. అయితే ఆ చట్టం కింద కేసు పెట్టే హక్కు కోడలిగా తనకు మాత్రమే ఉంటుందన్న పిటిషన్‌దారు వాదనను కోర్టు తిరస్కరించింది. కోడలు, ఆమె బంధువులు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని రాయబరేలీకి చెందిన సుధా మిశ్రా పోలీసులను ఆశ్రయించారు.