న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులో మాట పంచుకుంటున్నారు.
ఆ క్రమంలో ఇవాళ 2022కుగాను తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇండియాగేట్ సమీపంలోని అమర్‌జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరున్న అమరవీరుల జ్యోతిని ఇటీవల కలిపేశారని, ఆ ఉద్విగ్న సమయంలో దేశ ప్రజలు, అమరవీరుల కుటుంబాల కండ్లు చెమర్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రెండు జ్యోతుల విలీనం అమరవీరులకు గొప్ప నివాళిగా పేర్కొంటూ తనకు పలువురు రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉత్తరాలు రాశారని ప్రధాని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని ప్రధాని కోరారు. ఈ మన్ కీ బాత్ సందర్భంగా దేశంలోని కోటి మందికిపైగా చిన్నారులు తమ మనసుల్లోని మాటలను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని తెలిపారు.