Layoffs | న్యూఢిల్లీ, ఆగస్టు 12: టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ లేఆఫ్‌ల ట్రెండ్ ఇప్పట్లో నెమ్మదించేలా కనిపించడం లేదు. ఆర్థికపరమైన సవాళ్లు, పోటీ ఒత్తిళ్లతో పాటు కొత్త మార్కెట్ మార్పులను అనుసరించాల్సి రావడం వంటివి ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లేఆఫ్స్. ఎఫ్‌వైఐ డాటా ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 397 కంపెనీల్లో 1,30,482 మంది ఉద్యోగాలు పోయాయి. మరోవైపు పలు కంపెనీలు ఉద్యోగాల కోత బాటలో నడుస్తున్నాయి. మరో రౌండ్ లేఆఫ్‌లకు సిస్కొ కంపెనీ సిద్ధమవుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో చేపట్టిన 4 వేల ఉద్యోగాల కంటే ఈ దఫా అధికంగా కోతలు ఉండే అవకాశం ఉన్నదని రాయిటర్స్ నివేదించింది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి అధిక వృద్ధి ఉండే రంగాలపై దృష్టి సారించే వ్యూహంలో భాగంగా సిస్కో ఈ చర్య చేపడుతున్నట్టు తెలిసింది. జూలైలో ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకొనే ప్లాన్‌ను చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ప్రకటించింది. 2025 నాటికి కంపెనీ స్థిరత్వం సాధించేందుకు వ్యయ తగ్గింపులో భాగంగా ప్రసుత్తం కంపెనీలో ఉన్న శ్రామిక శక్తిలో 15 శాతానికి పైగా అంటే 15,000 మంది పైగా ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో ఉన్నట్టు సమాచారం.
మైక్రోసాఫ్ట్‌లో గత రెండు నెలల కాలంలో నిశ్శబ్ధంగా దాదాపు వెయ్యి మందిని తొలగించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అన్అకాడమీ, వేకూల్ వంటి భారత కంపెనీలు లేఫ్ల బాటలో పయనిస్తున్నాయి. ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించి ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటనలు చేశాయి. అన్అకాడమీ 250 మందిని, వేకూల్ 200 మందిని తొలగించనున్నట్టు ప్రకటించాయి. మరోవైపు ఐటీ ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతున్నది. భారత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో దాదాపు 42,000 ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.