న్యూఢిల్లీ : పొగాకు వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. దేశంలో దాని వినియోగం నానాటికీ పెరుగుతున్నట్టు తాజా సర్వే వివరాలు వెల్లడించాయి. ముఖ్యంగా గుట్కా, తంబాకు రూపంలో గ్రామీణులు అధికంగా పొగాకును వినియోగిస్తున్నట్టు ‘గృహాల్లో వినిమయం, వ్యయా’లపై సర్వే (హెచ్సీఈఎస్) పేర్కొన్నది. గ్రామీణ కుటుంబాలు తమ సంపాదనలో పొగాకు కోసం నాలుగు శాతం వినియోగిస్తుండగా.. విద్య కోసం మాత్రం కేవలం 2.5 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నట్టు ఆ సర్వే తెలిపింది.
ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించనున్న వార్షిక బడ్జెట్లో పొగాకు ధరలు మరింత పెంచే అవకాశం ఉండగా.. తాజా సర్వే ఆసక్తిని కలిగిస్తున్నది. గత దశాబ్ద కాలంలో దేశంలో పొగాకు వినియోగం స్థిరంగా పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2011-12 నుంచి 2023-24 మధ్య పొగాకుపై తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం పెరిగింది.