Morbi Cable Bridge | ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. వందల ఏండ్ల క్రితం మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ కేబుల్ బ్రిడ్జి మరమ్మతు పనుల కాంట్రాక్ట్ తీసుకున్న ఒరేవా గ్రూప్ మేనేజర్ వింత సమాధానం చెప్పారు.
ఈ కేసులో అరెస్టయిన ఒరేవా గ్రూప్ మేనేజర్లను పోలీసులు అదనపు సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ఎంజే ఖాన్ ముందు ప్రవేశ పెట్టారు. ఆ మేనేజర్లలో ఒకరు దీపక్ పరేఖ్ ఇది ‘దైవ నిర్ణయం ( will of God (bhagwan ki ichcha)) అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన దురదృష్టకర ఘటన అని వ్యాఖ్యానించారు. దెబ్బ తిన్న కేబుల్స్‌ను మార్చకపోవడం వల్లే వంతెన కూలిపోయిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో నిందితుల పక్షాన తమ సభ్యులెవరూ వాదించబోరని మోర్బీ, రాజ్‌కోట్ బార్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ కేబుల్ బ్రిడ్జి మరమ్మతు పనుల కాంట్రాక్ట్ 15 ఏండ్ల వరకు అంటే 2037 వరకు ఒరేవా కంపెనీకే అప్పగించారు. మోర్బీ మున్సిల్ కార్పొరేషన్‌తో ఈ బ్రిడ్జి నిర్వహణ, ఆపరేషన్, మరమ్మతులపై కాంట్రాక్ట్‌పై ఒరేవా కంపెనీ సంతకాలు చేసింది. అసలు ఒరేవా కంపెనీకి అర్హత లేదని మోర్బీ డీఎస్పీ పేర్కొన్నారు. అయినా, 2007, 2022ల్లో కేబుల్ బ్రిడ్జి మరమ్మతు పనుల కాంట్రాక్ట్ ఈ కంపెనీకే అప్పగించారని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి మరమ్మతు పనుల సమయంలో ఫ్లోరింగ్ మార్చిన కంపెనీ.. అరిగిపోయిన తీగల స్థానే కొత్తవి అమర్చలేదని ఆరోపించారు. ఫలితంగా కొత్తగా వేసిన నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోర్ బరువు ఎక్కువగా ఉండటంతో పాత తీగలు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందన్నారు.