Montha Cyclone : మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావంతో బీహార్ (Bihar) లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల వీస్తున్నాయి. దాంతో రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్ర, శనివారాల్లో పలు ఎన్నికల ర్యాలీలు రద్దయ్యాయి.
వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫలితంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, నటుడు పవన్ సింగ్ తదితర నేతలు తమ ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరికొందరు నేతలు సభలకు రాలేక మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
శనివారం సహర్సాలో జరగాల్సిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ర్యాలీ కూడా రద్దయింది. దాంతో ఆమె బచ్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి రోడ్డు మార్గంలో వెళ్లి సభలో పాల్గొన్నారు. ఈ తుపాను బీహార్లో పంటలను కూడా నాశనం చేసింది. కోత దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.