న్యూఢిల్లీ: సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వాయవ్య భారతం నుంచి నైరుతీ రుతుపవనాలు(Monsoon) తిరోగమనం చెందనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలో నైరుతీ రుతుపవనాలు ఎంటర్ అవుతాయి.ఆ తర్వాత జూలై 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వర్షాలు నమోదు అవుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వాయవ్య భారతం నుంచి రుతుపవనాలు తగ్గుతూ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తిగా కనుమరుగు అవుతాయి. అయితే ఈ ఏడాది పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాలు సెప్టెంబర్ 15వ తేదీ నుంచే తిరోగమనం చెందనున్నట్లు ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది రుతుపవనాలు.. జూలై 8 కంటే 9 రోజులు ముందుగానే దేశం మొత్తం కమ్మేశాయి. 2020 తర్వాత తొలిసారి రుతుపవనాలు జూన్ 26వ తేదీ కన్నా ముందు కవర్ చేశాయి. ఈ ఏడాది మే 24వ తేదీన కేరళకు రుతుపవనాలు చేరుకున్నాయి. 2009 తర్వాత ఈసారి అనుకున్న తేదీ కన్నా ముందుగా ప్రవేశించాయి. ఆ ఏడాది మే 23వ తేదీన రుతుపవనాలు ప్రవేశించాయి.
ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా 836.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణంగా 778.6 ఎంఎం వర్షం కురుస్తుంది. అయితే దాని కంటే ఏడు శాతం అధికంగా వర్షం పడింది. ఈసారి 106 శాతం వర్షం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు మే నెలలో ఐఎండీ అంచనా వేసింది. 96 నుంచి 104 శాతం మధ్య వర్షం నమోదు అయితే, గత 50 ఏళ్ల నుంచి దాన్ని నార్మల్గా భావిస్తున్నారు.