న్యూఢిల్లీ, ఆగస్టు 11: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. మణిపూర్ హింసాకాండపై చర్చకు కేంద్రం అంగీకరించనప్పటికీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని మోదీ నోరు విప్పేలా ప్రతిపక్షాలు చేయగలిగాయి. సభ మొత్తం 17 సార్లు సమావేశమై 44 గంటల 13 నిమిషాల పాటు చర్చలు జరిపిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు, డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు తదితర కీలక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని చెప్పారు. మరోవైపు మణిపూర్ అంశంపై రాజ్యసభలోనూ అదే ప్రతిష్ఠంభన నెలకొంది. వర్షాకాల సెషన్లో సభ మొత్తం 44 గంటల 58 నిమిషాలు భేటీ అయిందని చైర్మన్ జగ్దీప్ ధన్కర్ వెల్లడించారు.