న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతరం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్‌లో హింసాత్మక ఘటనల అంశం ఉభయసభలను కుదిపేసింది. మణిపూర్ అంశం చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు పట్టుపట్టడంతో.. ఉభయసభల్లో వాయిదాల పర్వం కంటిన్యూ అయ్యింది. విపక్షాల ఆందోళనల నడుమే అధికార పక్షం కొన్ని బిల్లులకు ఏకపక్షంగా ఆమోదముద్ర వేయించుకుంది.
ఆఖరి రోజైన శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌పై రభస జరిగింది. రాజ్యసభలోనూ ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలపై సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను ముందుగా 12 గంటల వరకు, ఆ తర్వాత 12.30 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం కూడా సభలో సేమ్ సీన్ రిపీట్ కావడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధిక వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా మాన్సూన్ సెషన్ పూర్తిగా ఎలాంటి పనికొచ్చే చర్చ లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఆఖరిరోజైన శుక్రవారం కూడా విపక్షాల నిరసనల నడుమే చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజ్యసభను నిరవధిక వాయిదా వేశారు.