Monsoon fury | దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో పొటెత్తిన వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో కనీసం 37 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరి ఆచూకీ గల్లంతైంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొండ ప్రాంతాల్లో కొండ చరియలు, రాళ్లు విరిగి పడటంతో వేల మంది ఇండ్లకే పరిమితం అయ్యారు.
అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్‌లో గరిష్టంగా 21 మంది మరణించగా, మరో ఆరుగురు అదృశ్యమయ్యారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ల్లో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. ఒడిశాలో ఆరుగురు, జమ్ము కశ్మీర్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో బ్రిటిష్ కాలం నాటి చక్కీ బ్రిడ్జి సహా పలు వంతెనలు వరద భీభత్సానికి కొట్టుకుపోయాయి. చండీగఢ్-మనాలీ జాతీయ రహదారి సహా పలు రోడ్లు మూసేశారు. వరదలతో ఆస్తి, ప్రాణ నష్టం కలగడం పట్ల హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. తెహ్రీ జిల్లాలో ఇంటి గోడ కూలడంతో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. పౌరీ జిల్లా యంకేశ్వర్‌లోనూ గోడ కూలిన ఘటనలో మహిళ మృతి చెందింది. తెహ్రీ జిల్లా కీర్తినగర్‌లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కొండ చరియలు విరిగి పడటంతో 235 రోడ్లు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
జమ్ముకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రియాసీ జిల్లా తాల్వరా ప్రాంతంలో పలు ఇండ్లు దెబ్బ తిన్నాయి. బంగాళాఖాతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌ల్లో మీదుగా అల్ప పీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీన పడవచ్చునని భారత వాతావరణ విభాగం తెలిపింది.