Monkey Attacks in Agra | తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను కోతులు బేలెత్తిస్తున్నాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోతుల బెడద నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు సిబ్బందిని రంగంలోకి దింపినా బీభత్సం కొనసాగిస్తున్నాయి. సోమవారం ఉదయం స్పానిష్కు చెందిన పర్యాటకురాలిపై కోతులు దాడి చేశాయి. సదరు మహిళ కాలును కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ యోగేశ్ పరాస్, ఏఎస్ఐ ఉద్యోగి అరుణ్ కుమార్ పర్యాటకురాలికి ప్రాథమిక చికిత్స అందించారు. గత పది రోజుల్లో తాజ్ మహల్లో కోతుల దాడి ఘటన ఇది నాలుగోది. 11న తమిళనాడుకు చెందిన షాహీన్ రషీద్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాయి.
ఆ మరుసటి రోజే స్వీడిష్ మహిళా పర్యాటకురాలిపై దాడి చేశాయి. 14న ఇద్దరు విదేశీ యువతులను సైతం గాయపరిచాయి. పర్యాటకులే లక్ష్యంగా కోతులు దాడులకు దిగుతున్నాయి. ప్రేమ సౌధం తాజ్ మహల్‌ను కనులారా వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులకు కోతులతో చేదు అనుభవం ఎదురవుతున్నది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో దసరా ఘాట్ ఆలయం నుంచి ఆహారం వెతుక్కుంటూ కోతుల గుంపు తాజ్ మహల్‌కు వస్తూ.. పర్యాటకులపై దాడి చేస్తున్నాయి. కోతుల బెడదతో స్థానికులు సిబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాసినా.. పట్టించుకోకపోవడంతో ఏఎస్ఐ అధికారులు కోతులను తరిమికొట్టేందుకు నలుగురు ఉద్యోగులను నియమించారు. అయినా, కోతుల బెడద తప్పడం లేదు.