ముంబై : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12 దేశాల్లో దాదాపు వంద కేసుల వరకు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నగరంలోని కస్తుర్బా ఆసుపత్రిలో 28 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ సస్పెక్ట్ రోగులను ఈ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
అయితే, ఇప్పటి వరకు మంకీపాక్స్ సోకినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని సదరు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రజలకు సలహాలు, సూచనలు జారీ చేసింది. మంకీపాక్స్ సాధారణంగా కోతుల్లో కనిపిస్తుందని, పశ్చిమ, మధ్య ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటికే వైరస్ కేసులు నమోదైన దేశాల నుంచి వస్తున్న విమాన ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షిస్తుండగా.. అనుమానిత రోగులను ఐసోలేట్ చేసేందుకు కస్తూర్బా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అనుమానిత రోగుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NIV)కి పంపనున్నట్లు పేర్కొంది. అలాగే ముంబైలోని ఆసుపత్రులతో పాటు ఆరోగ్య సంస్థలకు మంకీపాక్స్‌కు సంబంధించి అనుమానిత రోగులు వస్తే వెంటనే కస్తూర్బా ఆసుపత్రికి సమాచారం అందించాలని ఆదేశించింది. మంకీపాక్స్ సోకిన వారికి సాధారణంగా జ్వరం, దద్దుర్లు, శోషరస గ్రంథుల వాపు తదితర సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది.