MPox | ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో మొదలైన వైరల్ ఇన్ఫెక్షన్ అమెరికా, యూకే సహా ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాలు ప్రభావితమయ్యాయి. కాంగోలో ఇప్పటి వరకు 18వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. 610 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పొరుగుదేశమైన పాక్‌లోనూ ఐదుకేసులు రికార్డయ్యాయి. మంకీపాక్స్ చాలా వరకు ప్రాణాంతకం కాకపోయినా.. తీవ్రమైన సందర్భాల్లో మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రోజురోజుకు మంకీపాక్స్ విస్తరిస్తున్న క్రమంలో భారత ఆరోగ్యమంత్రిత్వ శాఖ సైతం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాకపోయినా.. ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే, మంకీపాక్స్ ఎంత ప్రమాదకరమో తెలుపడంతో పాటు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించింది. ఇటీవల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో మంకీపాక్స్ కొత్త స్ట్రెయిన్ క్లాడ్ ఐబీని గుర్తించారు. కేసుల పెరుగుదలకు ఈ స్ట్రెయిన్ కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వైరస్ రూపాంతరం చెందుతూ కొత్త స్ట్రెయిన్స్, కొత్త వేరియంట్స్‌తో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఎంపాక్స్ ఎలా విస్తరిస్తుంది.. ఇన్ఫెక్షన్ సోకితే ఏం చేయాలనేదానిపై ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరణాత్మక సమాచారం అందించింది.
మంకీపాక్స్ రోగులు వాడిన వస్తువులు, దుస్తులు ఉపయోగించడం, శరీరం నుంచి వచ్చే ద్రవాల ద్వారా వ్యాప్తిస్తుందని తెలిపింది. ఎక్కడికైనా వెళ్లిన సందర్భంలో సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని పేర్కొంది. వైరస్ సోకితే రెండు నుంచి నాలుగు వారాల వరకు ప్రభావం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సకాలంలో గమనించి వైద్యం అందించినట్లయితే కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెప్పింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించింది. మంకీపాక్స్ నిర్దిష్టమైన మందులు లేవని.. టీకాలపై అధ్యయనం జరుగుతున్నది. యాంటీవైరల్ డ్రగ్ టెకోవిరిమాట్ (TPOXX)ని మశూచితో పాటు మంకీపాక్స్‌పై అధ్యయనం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మంకీపాక్స్ తీవ్రమైన సందర్భాల్లో మశూచి వ్యాక్సిన్ ఇమ్వామ్యూన్ (JNEOS) ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.