లక్నో: సుమారు రూ.20 లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగ్‌ను ఒక వ్యక్తి నుంచి కోతి లాక్కెళ్లింది. (Monkey Snatches Bag With Jewellery) ఆ బ్యాగ్‌ను కోతి నుంచి తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీసుల సహాయాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోతిని చుట్టుముట్టారు. చివరకు దాని నుంచి ఆ బ్యాగ్‌ను తీసుకుని ఆ వ్యక్తికి అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ సంఘటన జరిగింది. జూన్ 6న అలీగఢ్‌కు చెందిన వజ్రాల వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి బృందావనానికి వెళ్లాడు. అక్కడున్న పలు ఆలయాలను వారు దర్శించారు.
కాగా, ఇంటికి తిరిగి వెళ్లేందుకు అభిషేక్ అగర్వాల్ తన కారు వద్దకు నడిచి వెళ్తుండగా ఒక కోతి అతడి చేతిలోని బ్యాగ్‌ను లాక్కెళ్లింది. ఆ బ్యాగ్‌లో రూ.20 లక్షల విలువైన ఆభరణాలు ఉండటంతో అభిషేక్, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్థానికుల సూచన మేరకు ఆ కోతికి పండ్లు, ఆహారం ఇవ్వటం వంటి ఆశపెట్టే ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసుల సహాయం కోరారు.
మరోవైపు పోలీసులు ఆ కోతిని గుర్తించి దానిని చుట్టుముట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి చివరకు దాని నుంచి బ్యాగ్‌ను తీసుకున్నారు. రూ.20 లక్షల విలువైన నగలున్న ఆ బ్యాగ్‌ను వజ్రాల వ్యాపారి అభిషేక్ అగర్వాల్‌కు అప్పగించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మతపరమైన ఆ పర్యాటక ప్రాంతంలో కోతుల ముప్పును నియంత్రించడానికి అధికారులు పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read: