MLA Munirathna | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తనపై బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న లైంగిక దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన మహిళ (40) ఇప్పుడు ఇదే కేసులో మరిన్ని కీలక విషయాలను బయటపెట్టారు. ప్రత్యర్థి పార్టీ నేతలను హనీట్రాప్ చేయడానికి మునిరత్న హెచ్ఐవీ సోకిన ఓ మహిళను వాడుకొన్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని మునిరత్నే తనతో స్వయంగా వెల్లడించినట్టు ఆమె చెప్పారు. ‘నా ప్రత్యర్థి పార్టీలోని ఓ నేతను బుట్టలోకి దించడానికి హెచ్ఐవీ సోకిన మహిళను హనీట్రాప్ కోసం వాడుకొన్నా. ఇంకో నేతను కూడా ఇలాగే ముగ్గులోకి దించడానికి మరో హెచ్ఐవీ సోకిన మహిళ నాకు కావాలి. సాయం చేస్తావా?’ అంటూ మునిరత్న తనను అడిగినట్టు సదరు మహిళ ఆరోపించారు. ఈ మేరకు తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించినట్టు బాధితురాలు పేర్కొన్నారు.
మునిరత్నపై నమోదైన కేసుల విచారణకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ(సీఐడీ) బీకే సింగ్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు లభురామ్, సౌమ్యలత, సీఏ సైమన్‌తో సిట్‌ను నియమించింది. కాగా, వారం వ్యవధిలో మునిరత్నపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఓ మహిళపై లైంగిక దాడి, ఓ కాంట్రాక్టర్‌ను కులం పేరిట దూషించిన ఆరోపణలతో ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తాజాగా రేప్ కేసులో మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. దళితులపై దుర్భాషలాడిన కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన మునిరత్నను.. ఈ రేప్ కేసులో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఆయన్ని 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మునిరత్నపై వస్తున్న వరుస ఆరోపణలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై కేంద్ర నాయకత్వానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్తున్నారు. ‘మునిరత్నపై ఏ నిర్ణయాన్నైనా కేంద్ర నాయకత్వమే తీసుకోవాలి’ అని కర్ణాటక బీజేపీ క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెంట్ లింగరాజ్ పాటిల్ అన్నారు.