న్యూఢిల్లీ, ఆగస్టు 28: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీకి చెందిన నిర్ణాయక ప్రక్రియపై ఆయన వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. మేమే నిర్ణయాలు తీసుకుంటే ఇంతకాలం పడుతుందా? వాళ్లు(బీజేపీ) తమకు తోచినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని పరోక్షంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనసాగింపుపై వ్యాఖ్యానించారు.
నడ్డా అధికారిక పదవీకాలం పూర్తయి రెండేళ్లు దాటినా ఇంకా పదవిలో కొనసాగడంపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం, రాష్ర్టాలతో తమకు మంచి సమన్వయం ఉందని ఆయన చెప్పారు. బీజేపీతో తమకు ఎటువంటి గొడవలు లేవని, ప్రతి సందర్భంలో తమ మధ్య మంచి సమన్వయం ఉందని ఆయన తెలిపారు. సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవు. మేము రాజీ గురించి మాట్లాడినపుడు పోరాటం మరింత తీవ్రమవుతుంది అని భాగవత్ వెల్లడించారు.
అన్ని విషయాలలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏకాభిప్రాయానికి రాలేకపోవచ్చని, ఏదో ఒక దశలో ఒప్పించగలమని తాము విశ్వసిస్తామని ఆయన అన్నారు. చాలా విషయాలపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆర్ఎస్ఎస్ కేవలం సూచనలు మాత్రమే ఇస్తుందని, బీజేపీ నిర్ణయ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ ఎన్నడూ జోక్యం చేసుకోదని భాగవత్ చెప్పారు. సంఘ్ శాఖను తాను 50 ఏండ్లుగా నిర్వహిస్తున్నానని, ఎవరైనా తనకు సలహా ఇస్తే దాన్ని వింటానని ఆయన అన్నారు. అయితే దేశాన్ని పార్టీ నడుపుతోందని, అందులో వారు నిష్ణాతులని, తాము(ఆర్ఎస్ఎస్) కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించిన వారే తమ వైఖరిని మార్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన చెప్పారు. జయప్రకాశ్ నారాయణ్ నుంచి ప్రణబ్ ముఖర్జీ వరకు ఆర్ఎస్ఎస్పై తమ వైఖరిని మార్చుకున్నారని ఆయన తెలిపారు.