Mohan Bhagwat : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో సందడి నెలకొంది. వరంగల్ భద్రకాళి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా సాగాయి. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తెల్లవారుజామున శస్త్ర పూజ నిర్వహించారు. అనంతరం ఘోష్ పాఠక్లో పాల్గొన్నారు.
ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తూ.. బంగ్లాదేశ్లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అక్కడ నెలకొన్న పరిణామాలు ప్రతి హిందువునూ ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఒక్క హిందువులు మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో నివసిస్తున్న ప్రతి మైనారిటీ కూడా దాడుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రాజకీయ పరిణామాలను హిందువులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారంటూ మోహన్ భగవత్ మండిపడ్డారు.
అక్కడ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడే సంప్రదాయం పునరావృతమైందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో హిందువులు ఏకతాటిపైకి రావడం, సమైక్యంగా రోడ్ల మీదికి వచ్చి ఉద్యమించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. ర్యాడికల్ భావజాలంతో హిందువులందరూ సంఘటితమయ్యారని, తమ రక్షణ కోసం రోడ్లపైకి వచ్చారని చెప్పారు. హిందువులకే కాదు, మైనారిటీలందరికీ భారత్ సహాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
హిందువులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఐక్యంగా శక్తిమంతం కావాల్సిన అవసరం ఉందని, బంగ్లాదేశ్లో చోటుచేసుకుంటున్న అఘాయిత్యాలు, దురాగతాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని మోహన్ భగవత్ కోరారు. భారత్ నుంచి ముప్పు ఉందని బంగ్లాదేశ్ భావిస్తోందని, అందుకే పాకిస్తాన్ సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. భారత్లో కూడా బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు రావాలని చాలామంది కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు.