ప్రధాని మోదీ గొప్ప నాయకుడని బీజేపీ తమ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇదంతా ప్రచారార్భాటమే! ‘ పైన పటారం, లోన లొటారమనీ, మోదీ పాలన డంబాచారం’ అని ప్రపంచమంతా కోడై కూస్తున్నది. వివిధ దేశాలలో ఆర్థిక పరిస్థితి, మానవ హక్కుల పరిరక్షణ, పాలనా దక్షత మొదలైనవి ఏ విధంగా ఉన్నాయనేది ఆయా సంస్థలు నివేదికల ద్వారా వెల్లడిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సంస్థలు సమర్పించిన నివేదికలలో మోదీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట అని తేటతెల్లమైంది.
వివిధ అంతర్జాతీయ అధ్యయన సంస్థలు వెల్లడించిన మొత్తం 53 సూచిలలో భారత్ 49 అంశాలలో దిగజారిపోయింది. పౌరహక్కులు, బహుళత్వానికి సంబంధించిన 6 సూచిలలో అధోగమనమే చాటుకున్నది. ఆరోగ్యం, విద్యకు సంబంధించిన 7 సూచిలలో వెలవెలపోయింది. మత స్వాతంత్య్రానికి సంబంధించి 2 సూచిలలో క్షీణించింది. చట్టబద్ధ పాలన, అవినీతి, పారదర్శక రంగాల 6 సూచిలో, సుస్థిరత, వాతావరణానికి సంబంధించి 6 సూచిలలో, మహిళల భద్రత, సమానత్వ 4 సూచిలలో, ఆర్థిక స్వాతంత్య్రం 5 సూచిలలో భారత్ దిగజారిపోయింది. ఐదారు రంగాల్లో ప్రపంచంలోనే అట్టడుగున ఉన్నది. అందులో కొన్ని సూచికలను, భారత్ అధోఃగమనాన్ని కింద ఇస్తున్నాం. మోదీ వైఫల్యాలకు ఇది నిలువుటద్దం.
ది ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ ప్రజాస్వామ్య సూచి
అంశం: పౌరహక్కులు, బహుళత్వం, రాజకీయ సంస్కృతి- భాగస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ
ప్రపంచంలో భారత్ స్థానం
2014లో – 27వ స్థానం
2020లో- 53వ స్థానం
ఫలితం: 26 స్థానాలు దిగజారింది.
కారణాలు: భారత్‌లో ఉన్నది లోపభూయిష్ట ప్రజాస్వామ్యంగా ఈ నివేదిక వర్గీకరించింది. ఈ నివేదిక ప్రకారం- 2015 నుంచి ప్రజాస్వామిక నియమాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. భారత్ స్కోర్ 2014లో 7. 92 ఉండగా, 2020 నాటికి 6. 61కి దిగజారింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం వెనుకడుగు వేయడమే ఇందుకు కారణం. మోదీ విధానాలు మత ఉద్రిక్తతలను పెంచి సామరస్య జీవనాన్ని దెబ్బతీశాయి. మోదీ ప్రభుత్వం భారత పౌరసత్వ భావనకు మతాన్ని జోడించింది. ఇది లౌకిక జీవనానికి భంగం వాటిల్ల చేస్తున్నదనేది విమర్శకుల అభిప్రాయం. ప్రజాస్వామ్య సూచికలో 2019లో 51 స్థానంలో ఉన్నది. పౌర హక్కులు క్షీణించడమే ఇందుకు కారణమని అప్పుడు నివేదిక పేర్కొన్నది. 2020 నాటికి మరో రెండు స్థానాలు దిగజారింది. అయితే ఇదే కాలంలో బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్ దేశాలలో
ప్రజాస్వామిక వాతావరణం మెరుగుపడింది.
ఫండ్ ఫర్ పీస్-బలహీన రాజ్యాలు
ప్రాతిపదికలు: సామాజిక సాన్నిహిత్యం- ఆర్థికరంగం- రాజకీయ రంగం.
2014: 81 2021: 66
15 స్థానాలు దిగజారడానికి కారణం: భద్రతా వ్యవస్థ బలహీనత, ఫ్యాక్షన్లు, ఆర్థికపతనం, అసమతుల్య అభివృద్ధి, మేధోవలస, మానవ హక్కులు-చట్టబద్ధ పాలన లోపించడం. భారత్ పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నదనే హెచ్చరిక వెలువడింది.
హెరిటేజ్ ఫౌండేషన్- ఆర్థిక స్వాతంత్య్ర సూచి:
ప్రాతిపదికలు: చట్టబద్ధ పాలన- ప్రభుత్వ పరిణామం- నియంత్రణా వ్యవస్థ సమర్థత, స్వేచ్ఛా మార్కెట్.
2014: 120
2021: 121
ఒక స్థానం దిగజారడానికి కారణం:
ఆర్థిక పటిష్ఠత, చట్టబద్ధ పాలనలను బలోపేతం చేయలేకపోవడం. రాజకీయ అవినీతి. అవినీతి వ్యతిరేక చట్టాలు ప్రభావం చూపకపోవడం. దీనివల్ల భూటాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ వెనుకబడింది.
యాక్సెస్ నౌ కీప్-ఇంటర్నెట్ షట్‌డౌన్ సూచి
ప్రాతిపదికలు: ప్రభుత్వం పౌరులపై ఇంటర్నెట్ బ్లాకేడ్ చేయడం, షట్‌డౌన్ చేయడం.
2014: 6.. 2020: 109
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో భారత్ దిగజారిపోయింది. కశ్మీర్లో 17 నెలలు ఇంటర్నెట్ బ్లాకేడ్ చేయడం జరిగింది. రైతుల నిరసనలు అణచివేయడానికి బ్లాకౌట్ జరిగింది. 2014లో 6, 2015లో 14, 2016లో 31, 2016లో 79, 2018లో 134, 2019లో 121, 2020లో 109 షట్డౌన్లు జరిగాయి. 2019లో ప్రపంచ వ్యాప్తంగా 213 షట్డౌన్లు జరిగితే అందులో 56 శాతం ఇండియాలోనివే.
లోయీ ఇన్స్టిట్యూట్ ఆసియా పవర్ సూచిక
ప్రాతిపదికలు: ఆర్థిక రంగం, దౌత్యం, సైనికశక్తి, నిబ్బరత, వాణిజ్యం, భావి పోకడలు, సాంస్కృతిక ప్రభావం
2018: 41.5
2020: 39.7
నలభై పాయింట్ల కిందకు పడిపోవడంతో, భారత్ మేజర్పవర్ హోదా కోల్పోయింది.
కారణాలు: దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం పెరుగడం, కోవిడ్ వల్ల ఆర్థిక రంగం దెబ్బతినడం, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి నుంచి భారత్ వైదొలగడం.
ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్ ర్యాంకింగ్
ప్రాతిపదికలు: దేశాల ఆర్థిక పనితీరు, ప్రభుత్వ సమర్థత
2013: 40
2021: 43
కారణాలు: భారత్ మూడు స్థానాలు పడిపోవడానికి కారణం బలహీన మౌలిక వసతులు, విద్యపై పెట్టుబడుల లోటు, ఆరోగ్య వ్యవస్థ అందరికి అందుబాటులో లేకపోవడం.
నుంబియో-జీవన ప్రమాణ సూచి
ప్రాతిపదికలు: కొనుగోలు శక్తి, కాలుష్యం, ఆదాయం-ఇంటి ధర నిష్పత్తి-జీవన వ్యయం-వైద్య వ్యయం
2014: 48
2021: 65
10 స్థానాలు దిగజారడానికి కారణం. జీవన వ్యయం పెరుగ డం, ప్రయాణ భారం, కొనుగోలు శక్తి తగ్గడం.
లెగాటెమ్ ఇన్స్టిట్యూట్- సౌభాగ్య సూచి
ప్రాతిపదికలు: విద్య, వైద్యం అందుబాటు, హింస నుంచి రక్షణ, పారదర్శకత
2015:99 2021:101
భారత్ రెండు స్థానాలు దిగజారడానికి కారణాలు: భద్రత, వ్యక్తిగత స్వాతంత్య్రం, జీవన పరిస్థితులు, విద్య, వైద్యం, సహజ వాతావరణం మొదలైన అంశాలలో భారత్ వెనుకబడి పోవడం.
వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు- చట్టబద్ధ పాలన సూచిక
ప్రాతిపదికలు: నేర, పౌర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ ప్రతిబంధకాలు, అవినీతి లేకపోవడం, పారదర్శకత, నియంత్రణా యంత్రాంగం, భద్రత
లక్షా ముప్ఫైవేల ఇండ్ల సర్వేలు, నాలుగు వేలమంది నిపుణుల సర్వేల ఆధారంగా.
2014: 66
2020: 69
భారత్ మూడు స్థానాలు పడిపోవడానికి కారణాలు:
అవినీతి లేకపోవడం (81 స్థానం), భద్రత (114 స్థానం), ప్రాథమిక హక్కులు(64వ స్థానం), నేర న్యాయ వ్యవస్థ (78వ స్థానం)అంశాలలో భారత్ వెనుకబడి పోయింది.
ప్యూ మత పరిమితులు సామాజిక వైషమ్యం
ప్రపంచంలో భారత్ స్థానం
2014: 9.0
2020: 9.6
మత పరిమితులు
2014: 5.0
2020: 5.9
కారణాలు: మత సంబంధమైన ఉద్రిక్తతలు, మత హింస, వేధింపులు పెరిగిన దేశాల సరసన చేరడం వల్ల భారత్ స్థానం దిగజారింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న 25 దేశాలలోకెల్లా ఈజిప్టు, ఇండియా, రష్యా, పాకిస్థాన్, ఇండోనీషియా దేశాలలో ప్రభుత్వ ఆంక్షలు, మత వైషమ్యాలు ఎక్కువగా ఉన్నాయి.
బీటీఐ పరివర్తన సూచి:
ప్రాతిపదికలు: ప్రజాస్వామ్యం- మార్కెట్ ఆర్థికవ్యవస్థ వైపు పరివర్తన.
2015: 26
2020: 34
8 స్థానాలు దిగజారడానికి కారణం: సంస్కరణల పట్ల తొందరపాటుగా వ్యవహరించటం. పెద్దనోట్ల రద్దు చర్య విఫలం కావటం. సమతుల్య అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి లేకపోవటం, పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టడం. హిందూ బృందాలు భారతదేశానికి లౌకిక ప్రతిష్ఠతను దెబ్బతీయటం.
ఐరాస సుస్థిరత అభివృద్ది – సంతోష సూచిక
ప్రాతిపదికలు: తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకర ఆయుర్దాయం, జీవితాన్ని ఎంచుకునే స్వాతంత్య్రం, అవినీతిపై భావన, భవిష్యత్‌పై భయం
2015: 117
2021: 139
భారత్ 22 స్థానాలు దిగజారిపోవడా నికి కారణాలు: జీవిత విశ్లేషణలు, ఆశావహ పరిస్థితి, దీర్ఘకాల జీవిత విశ్లేషణల్లో దిగజారిపోవడం
రిపోర్టర్స్ విథౌట్ బార్డర్స్- పత్రికాస్వేచ్ఛ సూచి
ప్రాతిపదికలు: మీడియా స్వేచ్ఛ బహుళత్వం స్వీయ నియంత్రణ, దాడులు, పారదర్శకత..
2014: 140
2021: 142
కారణాలు: దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం పెరుగడం, కొవిడ్ వల్ల ఆర్థిక రంగం దెబ్బతినడం, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వా మ్య కూటమి నుంచి భారత్ వైదొలగడం.
ఫ్రీడమ్ హౌజ్ – స్వాతంత్య్ర సూచిక
ప్రాతిపదికలు: చట్టబద్ధ పాలన, రాజకీయ బహుళత్వం, ఎన్నికలు, ప్రభుత్వపనితీరు, పౌర హక్కులు, భావ వ్యక్తీకరణ, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ, వ్యక్తి హక్కులు
2017: 77
2021: 67
భారత్ పది పాయింట్లు పడిపోవడానికి కారణాలు: స్వేచ్ఛ గల దేశం స్థాయి నుంచి పాక్షిక స్వేచ్ఛ గల దేశం స్థాయికి దిగజారిపోయింది. రాజకీయ, పౌర హక్కులు, ఇంటర్నెట్ స్వాతంత్య్రం అంశాలలో భారత్ వెనుకబడింది. కశ్మీర్ స్వేచ్ఛ లేని ప్రాంతంగా నమోదయింది.
2014 నుంచి మానవ హక్కుల పరిస్థితి దిగజారింది. మానవ హక్కుల సంఘాలపై ఒత్తిడి పెరిగింది. విద్యావేత్తలు, పాత్రికేయులపై వేధింపులు పెరిగాయి. మతోన్మాదుల దాడులు, కొట్టి చంపడాలు పెరిగిపోయాయి. నిరంకుశ మైన లాక్డౌన్ వల్ల లక్షలాది మంది అంతర్గత వలసలు సాగాయి. కొవిడ్‌కు కారణాన్ని అల్పసంఖ్యాకవర్గాలపైకి నెట్టారు. నిరంకుశ వ్యవస్థయైన చైనాకు.. ప్రతిగా ప్రజాస్వామ్య వ్యవస్థగా వెలుగాల్సిన భారత్ మోదీ హయాంలో నిరంకుశ పాలనలోకి వెళ్ళింది. ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాల ఉన్నత శ్రేణి నుంచి కిందికి పడిపోయింది
యూఎన్డీపీ మానవ అభివృద్ధి సూచిక
ప్రాతిపదికలు: పుట్టినప్పుడు బతికి ఉండటం, విద్య, జాతీయ ఆదాయం
2014: 130
2020: 131
కారణాలు: సగటు ఆదాయం, బాలికల విద్య ఆరోగ్యంపై పెట్టుబడి తగ్గింది.
సివికస్ మానిటర్ .. పౌర స్వేచ్ఛ
ప్రాతిపదికలు: సంఘాలు ఏర్పడే స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, భావ వ్యక్తీకరణ
రేటింగ్ విధానం: బహిరంగం, సంకుచితం, ఆటంకం, అణచివేత, మూసివేత
2017: ఆటంకం 2021: అణచివేత
కారణాలు: పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అనేక చట్టాల ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, మానవ హక్కుల సంఘాలను అడ్డుకోవడం.
చట్టాల ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, మానవ హక్కుల సంఘాలను అడ్డుకోవడం.
బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ సూచిక
ప్రాతిపదికలు: 102 దేశాలలోని 75 వేల మందితోపాటు 778 మంది నిపుణులను సర్వే చేయడం
2020: 27 2021: 36
కారణాలు: విధాన నిర్ణయాలలో, పాలనలో స్థిరత్వం లేకపోవడం నమ్మకం కలిగించలేకపోవడం
మోదీ కాలంలో ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కరోనాను కారణంగా చూపి తప్పించుకోవడం కూడా సాధ్యం కాదు. కరోనా రాకముందే అనేక రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని గణాంకాలను బట్టి తెలుస్తున్నది. పేదలు ఆహారంపై పెట్టే ఖర్చు కరోనా రావడానికి ముందే తగ్గిపోయింది. 2011-12తో పోలిస్తే 2017-18 నాటికి వినియోగదారుల వ్యయం భారీగా తగ్గింది. మోదీ పాలనలో నిరుద్యోగం భారీగా పెరిగింది. మధ్యతరగతి వర్గం పెరగకుండా స్తంభించిపోయింది. ప్రయాణికుల వాహనాలు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల అమ్మకాల పెరుగుదల స్తంభించిపోయింది. ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషిన్ వంటి వాటి అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కరోనా రాకముందే రైలు, విమానాల ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది.
2019 నాటికి దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోయింది. కిడ్నాప్‌లు 10.3 శాతం, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అత్యాచార నేరస్థులకు మరణశిక్ష చట్టం వచ్చింది. దీంతో బలాత్కారంతో పాటు హత్యలు పెరిగాయి. పిల్లలపై నేరాలు 4.5 శాతం, వృద్ధులపై దాడులు 13.7 శాతం పెరగడం గమనార్హం. సైబర్ నేరాలు 63 శాతానికి పెట్రేగిపోయాయి. దళితులపై 7 శాతం, ఆదివాసులపై 26 శాతం నేరాలు పెరగడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం భారీగా పెరిగిపోయింది. మహిళా కార్మికుల సంఖ్య కరోనాకు ముందే పడిపోయింది.
ప్రముఖ జర్నలిస్టు ఆకార్ పటేల్ రచించిన ‘ప్రైస్ ఆఫ్ ది మోదీ ఇయర్స్’ నుంచి…
ఆకార్ పటేల్ గుజరాత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు. గుజరాతీ, ఇంగ్లిష్ వార్తాపత్రికల్లో పని చేశారు. పలు పుస్తకాలు రాశారు. వీటిలో సాదత్ హసన్ మంటో ఉర్దూలో రాసిన రచనకు ఆంగ్ల అనువాదం ‘వై ఐ రైట్’, ‘అవర్ హిందూ రాష్ట్ర: వాట్ ఇటీజ్, హౌ వి గాట్ హియర్’, ‘ప్రైస్ ఆఫ్ ది మోదీ ఇయర్స్’, ‘ది అనార్కిస్ట్ కుక్‌బుక్’ ఉన్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ ఇండియా చెయిర్‌గా ఆకార్ పటేల్ ఉన్నారు.