Manish Sisodia | కేంద్రంలోని నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండి పడ్డారు. జాతీయ స్థాయిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజాదరణ పెరిగిపోవడం వల్ల అప్రమత్తమైన కేంద్రం.. సీబీఐని అడ్డం పెట్టుకుని తనను టార్గెట్ చేసుకుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాల గురించి ఆలోచిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని ఓ వార్తా చానెల్‌తో చెప్పారు. కానీ, కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.. తమ ప్రత్యర్థులపై దాడి చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
లిక్కర్ పాలసీలో నిబంధనల ఉల్లంఘన విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. మనీశ్ సిసోడియాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తన ఇంట్లో 14 గంటల పాటు విచారించినా.. సోదాలు జరిపినా ఏమీ ఆధారాలు దొరకలేదన్నారు. తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎటువంటి స్కామ్ లేదని, అందువల్లే ఏ ఆధారాలూ లభించలేదన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ మారుతారని ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. ఢిల్లీ ప్రజలకు హెల్త్‌కేర్, విద్యా ఉపాధి అవకాశాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్న వేళ సీబీఐ, ఈడీలతో తమ ప్రత్యర్థులపై కేంద్రం దాడులు చేస్తుందన్నారు.