ముంబై: చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ.. గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్(Sanjay Raut) అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన కేసులో.. సీజే సరైన న్యాయాన్ని అందిస్తారో లేదో అని రౌత్ పేర్కొన్నారు. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదని, ఆ కేసులో మరో పార్టీగా ప్రధానమంత్రి ఉన్నారని రౌత్ వెల్లడించారు. సాధారణంగా గణపతి పూజ సమయంలో ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుంటారని, ప్రధాని మోదీ ఎంత మంది ఇంటికి వెళ్లారన్న విషయంపై క్లారిటీ లేదని, కానీ సీజేఐ ఇంటికి మోదీ వెళ్లి హారతి పూజలో పాల్గొన్నట్లు సంజయ్ రౌత్ తెలిపారు. రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి.. రాజకీయ నాయకులను కలవడం ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తిస్తుందని ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన ఓ కేసులో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యర్థి అని, ఆ కేసు నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తిని ఆయన కలిశారు కాబట్టి కేసు నుంచి తప్పుకోవాలని రౌత్ తెలిపారు. ఆ కేసులో సీజేఐ న్యాయం చేస్తారో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కేసులో తేదీల మీద తేదీలను మార్చుతున్నారని, శివసేన-ఎన్సీపీ బంధం దాని వల్లే చెడిపోయిందని, తమకు న్యాయం జరగడంలేదని, మహారాష్ట్రలోని అక్రమ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు సంజయ్ రౌత్ ఆరోపించారు.