Modi | ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలాగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతాజీకి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏడాదిగా పరాక్రమ్ దివస్ ఉత్సవాలను నిర్వమిస్తూనే వున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విగ్రహ నిర్మాణం పూర్తయ్యే వరకే ఈ హోలోగ్రామ్ వుంటుందని, విగ్రహం పూర్తై తర్వాత ఈ హోలోగ్రామ్ స్థానంలో గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. ఇదో చారిత్రకమైన రోజుగా మోదీ అభివర్ణించారు. ఈ విగ్రహం కేవలం కర్తవ్యాలను మాత్రమే తెలియజేయకుండా, భావి తరాలకు నిరంతరాయంగా స్ఫూర్తిని కూడా అందిస్తూనే వుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛా భారతంపై నేతాజీ ఓ నమ్మకం కలిగించారని అన్నారు.
బ్రిటీషర్స్ ముందు తల వంచడానికి నేతాజీ ఏమాత్రం అంగీకరించేవారు కాదని, స్వాతంత్య్రాన్ని సాధించే విషయంలో ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకుండా పోరాడాలని నేతాజీ నిరంతరం బోధించేవారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్య్రం అడిగితే వచ్చేది కాదని, పోరాడి సాధించుకోవాలని కూడా అంటుండేవారని గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర భారత కలలను సాకారం చేసుకోవాల్సిన లక్ష్యం ప్రస్తుతం భారత ప్రజల ముందు ఉందని, 100 వ స్వాతంత్య్ర దినోత్సవాల కంటే ముందే ఓ సరికొత్త భారత్‌ను ఆవిష్కరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మోదీ ప్రకటించారు.
మరోవైపు 2019, 2020, 2021,2022 సంవత్సరాలకు గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అవార్డులను కూడా మోదీ బహూకరించారు. గతంలో విపత్తు నిర్వహణ అనేది వ్యవసాయం శాఖ కింద వుండేదని, కానీ.. తమ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ను మరింత పటిష్ఠం చేసిందని మోదీ గుర్తు చేశారు. అనేక అంతర్జాతీయ సంస్థలు విపత్తు నిర్వహణ సెక్టార్‌ను చూసి, పొగడ్తలు కురిపించారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.
దేశం విషయంలో గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని, దీనిని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. భారత దేశ గుర్తింపు, స్ఫూర్తిని పునరుద్ధరించాలన్న లక్ష్యంతోనే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ సంస్కృతి, సంస్కారాలతో పాటు అనేక మంది మహానుబావులు చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపించారని పరోక్షంగా కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు.