న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాక్ అయింది. ఖాతాను హ్యాక్‌చేసిన ఆగంతకులు ‘బిట్‌కాయిన్‌ను భారత్ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్కాయిన్లను కొన్నది. వాటిని భారతీయులకు పంచాలని నిర్ణయించింది. ఈ కింది లింక్‌ను షేర్ చేయటానికి త్వరపడండి. భవిష్యత్తు ఈ రోజే ఆవిష్కృతమైంది’ అనే సందేశాన్ని పోస్ట్ చేసి ఓ లింక్ ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ సాయంతో తిరిగి స్వాధీనంలోకి తెచ్చింది. ‘ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా ఆదివారం కొద్దిసేపు హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకుపోవటంతో సరిచేశారు. హ్యాక్ అయిన సమయంలో అందులో ఉంచిన సందేశాలను ఎవరూ నమ్మొద్దు’ అని పీఎంవో ప్రకటించింది. 2020 సెప్టెంబర్‌లో కూడా మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే సైబర్ నేరగాళ్లు గతంలో చాలామంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్‌చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు పలువురు సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలను హ్యాక్‌చేసి బిట్‌కాయిన్‌ను ప్రమోట్చేసేలా సందేశాలు పెట్టారు. ఈ కరెన్సీని నియంత్రించటం కష్టం కాబట్టి దేశంలో మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల సరఫరా పెరిగిపోతాయన్న భయాలు వ్యక్తమవుతుండటంతో భారత్‌లో క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేయటంపై ప్రధాని మోదీ వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ డిజిటల్ కరెన్సీ నియంత్రణకు త్వరలో చట్టం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురికావటం గమనార్హం.
నేడు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం
వారణాసి, డిసెంబర్ 12: ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా వారణాసిలో పర్యాటకం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న దశాశ్వమేధ ఘాట్ దగ్గరలో పునర్నిర్మించిన కాశీ విశ్వనాథుడి దేవాలయం, ద్వారాలను ఆయన ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దేవాలయాన్ని సందర్శించి, రూ.339 కోట్లతో నిర్మించిన విశ్వనాథ్ ధామ్‌ను ఆవిష్కరిస్తారని, అనంతరం విశ్వనాథుడికి పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. గంగా నది ఒడ్డు నుంచి నేరుగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ ధామ్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా యాత్రికులకు ఉపయోగపడే 23 భవనాలను ఆయన ప్రారంభించనున్నారు.